కవిత్వమనే మాటను చెట్టుకో, పుట్టకో, శ్రమకో, సౌందర్యానికో పరిమితమైన ఈ రోజుల్లో, భౌతిక శాస్త్ర సిద్ధాంతాలను మేళవించి సామాజిక విజ్ఞానాన్ని తన కవిత్వం ద్వారా తరగతి గది స్థాయికి తీసుకెళ్లిన ఘనత కచ్చితంగా కవి, ఫిజిక్స్ అరుణ్ కుమార్ చెందుతుంది. అలా అని, పూర్తిగా భౌతిక సిద్ధాంతాలకే అతుక్కుపోకుండా మానవ సంస్కృతి, సాంప్రదాయాలతో మమేకమైవున్న అనేకనేక శాస్త్రీయ దృక్పథాలనూ, ప్రజల ఆచార వ్యవహారాల వెనుక దాగివున్న సామాజిక విజ్ఞానాన్ని, సమాజం ముందు ఆవిష్కరించే సాధనంగా, కవిత్వాన్ని ఎంచుకున్న సంకల్పానికి, సాహితీ ప్రపంచంలో అరుణ్ కుమార్‌ను ఒక ప్రత్యేక స్థానంలో నిలబెట్టిందనడానికి తన తొలి కవితా సంపుటి ‘శూన్యం’, వ్యాస సంపుటి ‘బిగ్ బ్యాంగ్’ పొందిన విజయాలే సాక్ష్యం. ఇప్పు డు ఇదే ఒరవడిని కొనసాగిస్తూ తీసుకొచ్చిన మరో కవితా సంపుటి ‘జీరో గ్రావిటీ’ కవిని మరో మెట్టుపై నిలబెట్టిందనడాన్ని నిస్సందేహంగా చెప్పవచ్చు.
‘నా కవిత్వం ఓ నిత్యవ్వం, నా కలం ఓ విజ్ఞాన శరం. నా ఆలోచనల ముఖచిత్రం శతాబ్దాల ఉదయ యానం. అనంత విశ్వసేద్యంలో గెలాక్సీల సముదాయం’ అంటూ తన కవితలతో జీరో
గ్రావిటీలోనూ పాఠకుల బ్రెయిన్ స్క్రీన్లపై కవిత్వాన్ని ల్యాండింగ్ చేయడం ఈ ‘జీరో గ్రావిటీ’లో కనిపిస్తుంది. ఈ సంపుటి హెడర్‌లోనూ తనదైన శైలిలో ప్రముఖ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ‘ప్రత్యేక సాపేక్షతా సిద్ధాంతమైన E=mc2 నూ... అలాగే ‘సత్యమేవ జయతే’ అనే పదాలు ఉంచడం ద్వారా కవికి సైన్స్‌పై ఉన్న ఇష్టాన్నీ... సత్యమే ఎప్పుడూ జయస్తుంది అని ప్రాచీన కాలం నుండి విశ్వసిస్తున్న భారతీయుల నిబద్దతను తెలియజేయడం, కవికి ఈ మట్టిపై ఉన్న మమకారాన్ని కళ్ల ముందు ఆవిష్కరిస్తుంది.
మన దేశం అంతరిక్ష పరిశోధనలలో సాధిస్తున్న విజయాలను కీర్తిస్తూ ‘ఫస్ట్ స్టెప్ @ 50’ అనే కవితలో యాభై వసంతాల/ సుదీర్ఘ అంతరిక్షపు/ నవ స్వప్నపు యాత్రలో/ చంద్రయాన్ ఓ సైన్స్ విప్లవం/ మంగళయాన్ ఓ విజయ ఉద్యమం/ గగన్‌యాన్ రేపటి భవిష్యత్/ దిక్సూచి భారతం/ మేరా భారత్ మహాన్/... అంటూ ఒక నాటి ఆకలి భారతం నుండి అగ్ర దేశాల ఆధిపత్యానికి ఎదురొడ్డి సాధించిన విజయాల్ని నేటి మన సింహనాదపు జనగణమన ఛాయాచిత్రంగా అభివర్ణించారు. మ్యాథ్స్ ఈక్వేషన్స్, నాన్న ఎమోషన్స్‌తో అన్వయింపుగా చేసిన కవితలో భాధ్యతలను ప్లస్ చేస్తూ/ కష్టాలను మైనస్ చేస్తూ/ చిరునవ్వుల లబ్దంతో/ తాను సున్నా శేషమై మిగులుతాడు/... మన జీవితంలో నాన్న ఈక్వాలిటీ ఫాలో అవుతూ మనకు అనంతపు భవిష్యత్‌ను అందిస్తాడు అని బాధ్యతలను గొప్పగా గుర్తు చేశాడు.
మనిషి వేసే ప్రతి అడుగులోనూ కవిత్వం కనిపిస్తుందనీ, ఆ కవిత్వం సమాజాన్ని చైతన్యం చేసే ఆయుధమై శాంతిని కాంక్షించాలనీ, ప్రకృతిని కాపాడాలనీ, మానవతను పాడే జాతికి గీతమవ్వాలని ‘శూన్య కవిత్వం’లో... నవమాసాల/ అమ్మపోరు.. కవిత్వం/ నలుగురు మోసే/ పాడె తోడు.. కవిత్వం../ జనన మరణాల మధ్య/ బ్రతుకంతా కవిత్వం..!// అంటూ, ప్రేమ వికాసపు మార్పు కోరే కవి చేసే నిరంతర యుద్ధం కవిత్వం అని
చెప్పుకొచ్చారు. రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ మరణించిన డాక్టర్ భూమికా రెడ్డి అవయవదానంపై స్పందనగా రాసిన ‘ఆమె బ్రతికే ఉంటుంది’ అనే కవిత...
ఆ రోడ్డు ప్రమాదమే/ ఆమె స్ఫూర్తి ప్రకాశంలో/ పోరాడుతూ ఓడిపోయింది/ “ఆమె” అవయవదానానికి/ జీవన దిక్సూచిగా నిలిచిపోయింది// అంటూ మనుషులు ప్రమాదానికి గురై మరణించినప్పుడు చేసిన అవయవదానం ఇతరులను మరో పది కాలాల పాటు జీవించేలా చేస్తుందని చైతన్యవంతమైన కవిత ద్వారా తెలియజేసారు.
‘డ్రగ్స్ -డ్రీమ్స్’ కవితలో గంజాయి స్వరం/ ఓ గన్‌లా మారి/ మానవతా విలువల్ని/ మట్టిలో కలిపేస్తుంటే/ మాదక ద్రవ్యాల వాడకం/ మరణ శాసనాలను లిఖిస్తున్నాయి//... అంటూ డ్రగ్స్ రహిత సమాజానికి హితవు పలికారు. అర్ధమవుతుందా..!/ మన నిర్లక్ష్యపు అణుబాంబుకు/ అవని ఆరిపోయే దీపమయ్యేలా ఉంది/ మనందరి బాధ్యతారాహిత్యపు/ పర్యావరణ యుద్ధంలో.../ మనమే సమిధలం...సమాధులం// అంటూ ‘డిజిటల్ పొ(సొ)ల్యేషన్...!’ అనే కవితలో పర్యావరణం, ప్లాస్టిక్, కృత్రిమ రసాయనాలు, డీజే సౌండ్, ఈ- వేస్టేజ్, లాంటివి చూపించే ప్రభావాలను ఎరుక పరచి, వీటన్నింటిపై మనందరం కలసికట్టుగా పోరాడాల్సిన బాధ్యతను గుర్తు చేస్తుంది. నా మౌనపు శిలాక్షరాలు/ నన్ను ప్రశ్నిస్తుంటే/ తలెత్తుకొని సగర్వంగా/ రైతు పక్షమై కవిత్వం రాస్తున్నా...!/ బడుల్లో పాఠాల ఉదయాలు ప్రకాశించాలి/ పొలాల్లో పంటల/ పసిడి కాంతి పండాలి/..అని దినదినం దుర్భేద్యమైన బ్రతుకులతో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులను కాపాడాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులపై ఉందని అరుణ్ కుమార్ తన కవిత ‘రాలిపోతున్న రైతు నక్షత్రాలు’లో చాలా భావోద్వేగంతో తెలియజేశారు.
లోక కవి అందెశ్రీ గారిని తలుచుకుంటూ...అక్షర జీవనదులకు పల్లె పలుకులతో ప్రాణం పోసి/ జానపద జవసత్వాన్ని నింపి ప్రపంచ పటంపై/ మట్టి పాటల కలలను పారించారు/...అంటూ అందెశ్రీ గారిని గొప్పగా స్మరించుకున్న తీరు కంటతడి పెట్టిస్తుంది.
సంపుటిలో చాలా కవితలు సామాజిక స్పృహ కలిగించేవిగా ఉంటాయి. భౌతిక భావాలకు, మానవీయ విలువలకు మధ్య జరిగే పరస్పర కోణాలను ఈ సంపుటి ప్రతిబింబిస్తుంది. మహానీయులు అబ్దుల్ కలాం, సునీతా విలియమ్స్, మహత్మా గాంధీ, అంబేడ్కర్, జయశంకర్, కాళోజీ, గోరటి వెంకన్న, సిరివెన్నల లాంటి వాళ్లను తన కవిత్వంలో పొందుపరచడం ద్వారా కవి ఇక్కడే విజయం సాధించారని చెప్పవచ్చు. మొత్తానికి అందరూ చదవాల్సిన సంపుటి ఇది. విద్యార్థులకు మరో జ్ఞాన దీపిక ‘జీరో గ్రావిటీ’.
- వినోద్ కుత్తుం
